ఐకమత్యం - మహాబలం

writer
0
అనగనగా ఒక అడవి, ఆ అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలిసి ఉండేవి. అడవి దగ్గరున్న గ్రామానికి వెళ్లినా కలిసి వెళ్లి వస్తుండేవి. మేతకి వెళ్లినా, నీళ్లకోసం ఏటికి వెళ్లినా కలిసే వెళుతుండేవి. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడిపేవి. కొన్నాళ్ళకు అవి ఉన్న ప్రాంతానికి ఒక పులి వచ్చింది. బలిసిన ఆవుల్ని చూసి పులికి నోరూరింది. కానీ వాటిని ఒక్కటిగా ఎదుర్కోవడం కష్టమని గ్రహించింది. 

ఎంత ప్రయత్నించినా వాటి మధ్య విభేదాలు రావడం లేదు. పులిని దూరంగానే చూసి పోతున్నాయి గాని పలకరించడం లేదు. అలా వేచిన చాలా రోజులకి ఒకరోజు ఒక ఆవు గడ్డి మేయడానికి కాస్త దూరం వెళ్ళింది. అదను చూసిన పులి దాని దగ్గరకి వెళ్ళింది. ఇలా ఒకదాని వెంట ఒకటి తిరిగితే ప్రయోజనం లేదు, లోకం చాలా విశాలమైనది, ఎన్నో వింతలు వున్నాయి. తనని చూసి తనలాగా ఆస్వాదించాలని, ఇలానే ఉండిపోతే జీవితం వ్యర్థం అవుతుందని ఊరిస్తూ చెప్పింది. పైగా ఎవరి ఆకలి వారిదిగాని, ఒకరి ఆకలి కోసం మరొకరు అవస్థలు పడడంలో అర్ధం లేదని చెప్పింది. ఇది విన్న ఆవు నిజమే కదా మిగతా వాటి కోసం తాను ఎందుకు అవస్థ పడాలని అనుకుంది. 

మర్నాడు నుండి మిగతా మూడింటికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది. దాని పరిస్థితి తెలుసుకొని వాటిలో విభేదాలు రావడం మొదలయ్యాయి. అంతే! కొద్దిరోజులకు నాలుగు ఆవులు ఐకమత్యంతో ఉండక ఎవరి దారి అవి చూసుకున్నాయి. పులి వాటి పరిస్థితి గమనించి ఎంతో సంతోషించింది. తన ఎత్తు పారిందనుకుంది. ఏటి దగ్గరకి వచ్చిన దాన్నివచ్చినట్టు మీదపడి చంపి తినడం మొదలు పెట్టింది. అందుకే అంటారు.. చెప్పుడు మాటలు వింటే ఐకమత్యం దెబ్బతింటుందని. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

Please Select Embedded Mode To show the Comment System.*