పిచ్చుక - కాకి

writer
0
ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకొని తన పిల్లలతో ఉండేది. వానాకాలం వచ్చింది. ఒకరాత్రి కుండపోతగా వర్షం కురవడం మొదలైంది. బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది. పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగయి. పిచ్చుక తన పిల్లలను తీసుకొని కాకి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది.

"ఎవరూ?" అంటూ లోపలి నుండి అడిగింది కాకి. 

"కాకమ్మా నేను. వానగాలికి నా గూడు చెదిరిపోయింది. నా పిల్లలు వర్షానికి తడచి పోతున్నాయి" అంది పిచ్చుక.

"అయితే నేనేం చేయాలి?" అంటూ ప్రశ్నించింది కాకి.

"వర్షం ఆగేవరకు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వు" అంటూ ప్రాధేయపడింది పిచ్చుక.

"నా పిల్లలు వెచ్చగా పడుకొని ఉన్నాయి. నేను తలుపు తీయలేను" అని నిర్దాక్షిణ్యంగా చెప్పింది కాకి.

దానితో పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని "ఎవరు?" అని అడిగింది.

"పిచ్చుకమ్మా నేను కాకిని. నా ఇల్లు వార్షానికి కూలిపోయింది. నా పిల్లలు తడిచి పోతున్నాయి. దయచేసి తలుపు తీస్తే ఈ రాత్రికి నీ ఇంట్లో ఉంటాను." అంది కాకి బయట నుండి. పిచ్చుక వెంటనే తలుపు తీసింది. కాకి పిల్లలను తన రెక్కలతో ముడుచుకొని లోపలికి తీసుకొని వచ్చింది.

గతంలో పిచ్చుకతో తను ఎలా ప్రవర్తించాను అని గుర్తుకు వచ్చి కాకి సిగ్గుతో తల వంచుకుంది. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

Please Select Embedded Mode To show the Comment System.*