ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పని చేసి అలిసిపోయి, ఇంటికి వచ్చి, నడుము వాల్చి, ‘ఓ దేవుడా! నాకొక చిన్న నిధి ఇవ్వలేవా?' అని ప్రార్థన చేశాడు.
అకస్మాత్తుగా అతని ముందొక సంచీ పడింది. మరుక్షణమే అతనికి ఇలా వినబడింది:‘ఈ సంచీలో నీకు బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణేలైనా దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక, ఈ సంచీని నదిలో పారెయ్యి, అయితే ఒక్కటి గుర్తుంచుకో, సంచీని నదిలో పారేసేదాకా నువ్వా డబ్బును ఖర్చు చేయరాదు. అలా ఖర్చు చేశావో, నువు తీసిన డబ్బు యావత్తూ మాయమవుతుంది. '
రైతు పరమానందం చెంది, ఆ రాత్రల్లా సంచీలో నుంచి బంగారు నాణాలు తీసి, ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు. సంచీని నదిలో పారేసిన దాకా బంగారాన్ని వాడటానికి లేదు. ఇంకొక్క రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతం నింపి, తరువాత సంచీని నదిలో పారేద్దామనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోతాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి. రైతు రోజూ బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి చూసి ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కొద్దీ బంగారు నాణాలుండటం చూసి నిర్ఘాంతపోయారు.
