దయా గుణం

writer
0
వెంకటాపురంలో ఒక అందమైన పాఠశాల వుంది. అక్కడ రావి, వేప, కానుగు చెట్లు, ఎన్నో రకాల పూలమొక్కలు ఉండేవి. మైదానం విశాలంగా ఉంటుంది. ఆ గ్రామానికి పక్కనే పెద్ద అడవుంది. పట్టణాభివృద్ధి పేరుతో చెట్లను నరికివేస్తుండడంతో అందులో ఉండే జంతువుల్ని అడవిని విడిచిపెట్టి పోయాయి. కోతులు మాత్రం దగ్గర్లో ఉండే ఆ పాఠశాలలోని చెట్లమీద నివాసం ఏర్పరుచుకున్నాయి. పిల్లలు మధ్యాహ్నం తిని పారేసిన ఆహార పదార్థాలను ఏరుకు తినేవి. 

ఓరోజు పిల్లలంతా చెట్టు కింద కూర్చొని అన్నాలు తింటున్నారు. ఓ బుల్లి కోతిపిల్లకి ఆకలిగా ఉందేమో! చెట్టు నుంచి దిగి వచ్చి తొంగి చూసింది. దాన్ని గమనించిన తిరుపతి అనే విద్యార్ధి, దాని మీద కర్ర విసిరాడు. సూటిగా వెళ్లి కర్ర ఆ బుల్లికోతి  కాలికి తగిలింది. పాపం దాని కాలికి గాయమై రక్తం కారసాగింది. ఆ సమయంలో సాయికృష్ణ వచ్చి తిరుపతితో "అరేయ్! నతిండి నువ్వు తినక కోతినెందుకు కొట్టావ్? అది నిన్ను ఏమైనా చేసిందా? ఆకలై వచ్చి ఉంటుంది. మనకైనా, కోతికైనా బాదొకటే కదా! పాపం దెబ్బ తగిలి అది లేవలేకపోతుంది చూడు" అన్నాడు కోపంగా. తిరుపతి కూడా అనవసరంగా కోతిని కొట్టినందుకు బాధ పడ్డాడు. ఇద్దరూ కలిసి కోతిని దగ్గర్లోనిఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. వైద్యుడు దానికి కట్టుకట్టి, సూదిమందు ఇచ్చారు. ఆయన బయటకు వెళ్ళగానే నర్సు వచ్చి "కోతిని ఆసుపత్రికి తీసుకొని రావడం అవసరమా? ఎక్కడైనా కోతికి చికిత్స చేయించడం చూశారా?" అని అడిగాడు. 

అప్పుడు సాయికృష్ణ "కోతి మనలాంటి ప్రాణే కదా సర్! దెబ్బ తగిలితే దానికి నొప్పి పెడుతుంది కదా, చూస్తూ ఎలా వదిలేస్తాం" అన్నాడు. సాయికృష్ణ దయా గుణాన్ని మెచ్చుకున్నాడు నర్సు. కోతికి తినిపించమని అరటిపళ్లు ఇచ్చాడు. సాయికృష్ణ, తిరుపతి కోతికి పళ్లు తినిపించి, తీసుకొని వచ్చి చెట్టు దగ్గర విడిచిపెట్టారు. అది వెల్తూ వెనక్కి తిరిగ ధన్యవాదాలు తెలిపినట్లు చూసి చెట్టెక్కేసింది. ఉపాధ్యాయులతో సహా అందారో సాయికృష్ణని మెచ్చుకున్నారు. 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

Please Select Embedded Mode To show the Comment System.*