దొంగ ఎవరు?

writer
0
ఒక ఊళ్ళో ఓ ముసలి రైతు ఉండేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. ఓసారి రైతుకు తీవ్రంగా జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేదన్నారు. ఓరోజు నలుగురు కొడుకుల్ని దగ్గరకి రమ్మని పిలిచాడు రైతు. 

"నేను ఇంక ఎక్కువ కాలం బతకను. నా జీవితాంతం చెమటోడ్చి కొంత సొమ్ము, ఓ నాలుగు వజ్రాలు సంపాదించాను. అవన్నీ ఓ పెట్టెలో దాచిపెట్టాను. అవసరం అయినప్పుడు మీ అమ్మని అడిగి నలుగురూ సమానంగా పంచుకోండి" అని చెప్పి చనిపోయాడు. 

కొన్నాళ్ళ తరువాత నలుగురు వేర్వేరుగా వ్యాపారాలు ప్రారంభించాలని అనుకున్నారు. పెట్టుబడి కోసం తండ్రి సంపాదన వాటాలు వేసుకుందాం అని నిర్ణయించుకుని నలుగురిలో చిన్నవాన్ని డబ్బులు పెట్టే తీసుకొని రమ్మని ఇంటికి పంపారు.

"గొడవలు పడకుండా పంచుకోండి నాయనా" అంటూ చిన్నకొడుకు చేతిలో డబ్బు పెట్టెను పెట్టింది వాళ్ళమ్మ. 

ఇంట్లో నుంచి బయటకి వచ్చే లోపు ఆ పెట్టెలో ఉన్న వజ్రాలలో ఒక దాన్ని చిన్నకొడుకు దొంగిలించాడు. 

తరువాత, పెట్టె తెరిచి చూసిన మిగతా ముగ్గురు కొడుకులు ఆశ్చర్యపోయారు. "ఇంకో వజ్రం ఏమైంది" అని చిన్నవాడిని నిలదీస్తే "నాకు తెలియదు" అని చెప్పాడు. 

"ఎవరు దొంగో తేలాలంటే మనం మర్యాద రామన్న దగ్గరకి వెళ్ళాలి" అన్నాడు పెద్దకొడుకు. సరేనని నలుగురు బయలుదేరి వెళ్లారు. 

ఆ సోదరులు చెప్పిందంతా విన్నాడు రామన్న. "నా దగ్గర ఓ మంత్రకర్ర ఉంది. దీన్ని నాలుగు ముక్కలుగా చేసి ఒక్కో కుండలో వేస్తాను. ఈ కుండల్ని మీ నలుగురు నెత్తిన పెట్టుకొని ఊరి చివరన ఉన్న గుడి వరకూ వెళ్ళి తిరిగి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఎవరి కుండలో కర్ర రెండింతలు పొడువు పెరుగుతుందో వాల్లేవసలు దొంగ" అని చెప్పి వాళ్ళని పంపాడు. 

నలుగురూ బయలుదేరారు. ఊరి చివరకి వచ్చేసరికి దొంగతనం చేసిన చిన్నకొడుకుకి ఓ ఆలోచన వచ్చింది. 

"దొంగతనం చేసింది నేనే కదా! అంటే నా కుండలో కర్రే పెద్దది అయిపోతుంది. కాబట్టి దీన్ని సగానికి విరిచేస్తే సరిపోతుంది" అనుకొన విరిచేశాడు. 

తిరిగి నలుగురూ మర్యాద రామన్న దగ్గరకి చేరుకున్నారు. కుండల్లో ఉన్న కర్రలు తీసి చూసేసరికి చిన్నవాడిది సగం చిన్నగా కనిపించింది. వజ్రం దొంగ ఎవరో అందరికీ అర్థం అయింది.

"నిజానికి ఈ కర్రలో ఎలాంటి మాయమంత్రం లేదు. అసలు దొంగను పట్టుకోవడానికి పథకం పన్ని అలా చెప్పాను" అని వివరించాడు మర్యాద రామన్న. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

Please Select Embedded Mode To show the Comment System.*