అమ్మో ఇదేం పండు!

writer
0
తెనాలి రామలింగడు రాజ మందిరానికి వెళుతుండగా... మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్లెంలో తియ్యటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడిపండ్లు ఒక ఉత్తరం అందులో ఉంచి తీసుకొని వెళుతున్నాడు. 
ఆ మామిడిపండ్లు చూసేందుకు చాలా బాగున్నాయి, దానితో రామలింగడికి వాటిని తినాలనిపించింది. అయినా తమాయించుకొని రాజ మందిరానికి చేరాడు. 
అతని వెనకాలే మామిడిపండ్ల పల్లెంతో లోపలికి వచ్చిన వ్యక్తి... "రాజా వీటిని మీ కోసం పక్క రాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వాళ్లకి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని సందేశం" అన్నాడు. పండ్లను అక్కడ పెట్టి వెళ్ళమన్నాడు రాజు. 
ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులోని ఒక పండును తీసుకొని కొరికాడు. "ఏమిటి... మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా... అదీ కనీసం నా అనుమతి తీసుకోకుండానే... ఎంత ధైర్యం... నీకు మరణ శిక్ష తప్పదు..." అంటూ గట్టిగా అరిచిన రాజు, భటులను పిలిపించి రామలింగడిని తీసుకొని పొమ్మన్నాడు. వాళ్ళు రామలింగడిని పట్టుకోగానే... "అమ్మో పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు. మంచి పండ్లని చెప్పి, ఎలాంటి మామిడిపండ్లు మనకు పంపాడు. ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడు గతేంటి..." అంటూ అరవడం మొదలు పెట్టాడు. 
రామలింగడి చమత్కారం మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చిందిం అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికి ఇచ్చి పంపాడు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

Please Select Embedded Mode To show the Comment System.*