గొప్ప త్యాగం

writer
0
శివానంద అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి "ఓయీ మానవుడా! నేను మిక్కిలి ఆకలిగొని  ఉన్నాను. నిన్ను తినేస్తాను" అన్నాడు.
శివానంద చేతులు జోడించి " రక్షసొత్తమా! నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను" అన్నాడు. " వెళ్ళి త్వరగా రా" అన్నాడు రాక్షసుడు. 
శివానంద వేగిరంగా ఇంటికెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి " అమ్మాయి వివాహం చక్కగా జరిపించు" అని మార్గమధ్యంలో జరిగింది భార్యకి వివరించాడు.
చాటునుండి ఇది విన్న శివానంద తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి " నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు" అని అన్నాడు.
ఇంతలోనే శివానంద వచ్చి కుమారుడిని వదిలేసి, తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ  ఉండగానే దూరం నుండి కర్ర సాయంతో ఒక వృద్దుడు వచ్చి " నేను శివానంద తండ్రిని. నన్ను తిని వాళ్ళని వదిలేయి" అన్నాడు. 
అంతలో ఒక ముత్తైదువు వచ్చి "భర్తను, కొడుకుని కోల్పోయి నేను జీవించలేను. నన్ను తిను" అన్నది. ఈ లోగా ఒక నవజవ్వని  వచ్చి "ఈ అనర్థానికి మూలం  నేను. నాకు నగలు తేవడానికి వెళ్ళిన నా తండ్రి నీ కంట పడినాడు. నన్ను తిను" అన్నది.
వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంట  జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి " నేనొక గంధర్వడను. శాపం వల్ల రాక్షసుడిగా మారాను. మీ వల్ల నాకు శాపవిమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరిసంపదలు కానుకగా ఇస్తున్నాను తీసుకోండి"  అని కానుకలు సమర్పించి అదృశ్యం అయ్యాడు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

Please Select Embedded Mode To show the Comment System.*