పూర్వం దోమలు, ఈగలు మనుషులు జీవించే ప్రాంతాల్లో ఉండేవి కావు. అడవుల్లో జంతువులు, పక్షులతోపాటు జీవించేవి. అడవికి రాజైన సింహం అందరిని చక్కగా చూసుకొనేది. రాజు గారి ఆస్థానంలో నక్క మంత్రి, ఏనుగు సేనాధిపతి, ఎలుగుబంటి న్యాయాధిపతి, నెమలి నాట్య కళాకారిణి, కోయిల సంగీత విద్వాంసురాలు వున్నాయి.
మేం చాలా బాగా పాడగలమని దోమలు, మేం చక్కగా నాట్యం చేయగలమని ఈగలు భావించేవి. ఎలాగైనా రాజుగారి దగ్గర తమ విద్యలను ప్రదర్శించి ఆస్థానంలో కొలువు సంపాదించాలని వాటికి బుద్ధి పుట్టింది.
ఓ రోజు 'గీ... గీ...' అని పాడుకుంటూ పొదలో హాయిగా నిద్రపోతున్న జింక మీద వాలింది దోమ. నిద్రాభంగమైన జింక కోపంతో "ఏంటీ గోల... పో... అవతలకి" అంటూ కసిరింది. "ఎందుకలా విసుక్కుంటావు. ఏం నా పాత బాలేదా?" అడిగింది దోమ. "ఇంకోసారి నోరు తెరిచావంటే నీ మొహం పగలగొడ్తాను" అని కోపంగా తిట్టి నిద్రలోకి జారుకుంది జింక.
అవతల ఓ ఉఉడుత ఏదో తింటుంది. దాని దగ్గరకి ఓ ఈగ వచ్చింది. "ఉడుత బావా! నా నృత్యాన్ని చూడవా? నేను నెమలి కంటే బాగా నాట్యం చేస్తాను" అంటూ ఎగురుతూ, ఎగురుతూ ఉడుత మీద, దాని ఆహారం మీద వాలింది. కంగారు పడిన ఉడుత తన ఆహారాన్ని పడేసుకుంది. "ఎలా వుంది నా నృత్యం?" అని అడిగింది ఈగ. చిర్రెత్తిన ఉడుత, ఈగ తల మీద ఒక్కటిచ్చింది.
ఇలా దోమల పాటలతో, ఈగల ఆటలతో జడుసుకున్న జంతువులన్నీ రాజుగారిని కలిశాయి. తనతో ఓరోజు సింహం... దోమలను, ఈగలను పిలిచి, "ఇంతకాలం మీ ప్రతిభను మా ముందే ప్రదర్శించారు. మీ గొప్పతనం మిగతా అందరికి తెలియాలంటే ఓ పని చెయ్యాలి" అంది.
"ఏం చెయ్యాలి?" అంటూ దోమలు, ఈగలు అత్యుత్సాహముతో ఒకేసారి అరిచాయి. "ఈ అడవికి నాలుగువైపులా ఎన్నో ఊళ్ళున్నాయి. అక్కడున్న మనుషులకు మీ పాటలు వినిపించండి, మీ నృత్యం చూపించండి, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, బహుమతులు కూడా ఇస్తారు" అంది నక్క మంత్రి.
"మనుషులు మీకు సరైన న్యాయం చేస్తాను" అని చెప్పింది ఎలుగు న్యాయాధిపతి.
"మీరు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను" అంది సేనాధిపతి అయిన ఏనుగు.
సంతోషించిన దోమలు, ఈగలు జట్లు, జట్లుగా ఊళ్ళవైపు వెళ్లిపోయాయి. ఆ రోజు నుండి దోమల, ఈగల బాధ మనుషులకు మొదలయింది.
